ముంబై, 23 ఆగస్టు (హి.స.)వాహన కాలుష్యం నియంత్రణే లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాలకు ఫీజు మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయవద్దని ఆదేశించింది. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
ఢిల్లీలో వాహన కాలుష్యంతో ఏర్పడిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాహన కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు టోల్ ట్యాక్స్ మినహాయిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ చెప్పారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్ కార్లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరిగి, తయారీ కంపెనీలు రాష్ట్రం వైపు మొగ్గుచూపుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటనపై ఆయా వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి