అమరావతి, 23 ఆగస్టు (హి.స.)సీపీఐ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి గత రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, సుధాకర్ రెడ్డి సేవలను గుర్తుచేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే పోరాట పంథాను ఎంచుకున్న ఆయన, చివరి వరకు ప్రజల కోసమే పనిచేశారని కొనియాడారు. ముఖ్యంగా రైతులు, కార్మికుల సమస్యలపై ఆయన బలంగా గళం వినిపించారని వివరించారు. లోక్ సభ సభ్యుడిగా దేశానికి, తన ప్రాంతానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు.
నల్గొండ ప్రాంతంలో ఫ్లోరోసిస్ మహమ్మారి, సాగునీటి కొరత, కరవు పరిస్థితులపై సుధాకర్ రెడ్డి చేసిన పోరాటాలు చిరస్మరణీయమని పవన్ కల్యాణ్ అన్నారు. మూడు పర్యాయాలు సీపీఐ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి