తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ సమీక్ష
తిరుమల, 23 ఆగస్టు (హి.స.) బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించ
తిరుమలతిరుమల


తిరుమల, 23 ఆగస్టు (హి.స.)

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అధికారులతో ఆయన బ్రహ్మోత్సవాల్లో భక్తుల వసతి, ఇతర సౌకర్యాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని పలు విశ్రాంతి గృహాలు, కాటేజీల మరమ్మతు పనులను రిసెప్షన్ విభాగంతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాత్రికుల వసతి సముదాయాల్లో కూడా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున వేరొక ప్రాంతంలో కూడా అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆహార భద్రతా అధికారులతో తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించాలన్నారు. అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ విభాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీఈ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande