హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఇస్రో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. గగన్‌యాన్ మిషన్ కోసం చాలా ముఖ్యమైన మొదటి ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01)ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ పరీక్షలో పారాచూట్ ఆధారిత వ్యవస్థ సామర్థ్యాన్ని పరీక్షించారు. దీంతో అంతరిక్షం నుంచి తిరిగి వచ్చేటప్పుడు భారతీయ వ్యోమగాములు సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా చూసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వైమానిక స్థావరం నుంచి ఈ పరీక్షను వైమానిక దళం, DRDO, నౌకాదళం, కోస్ట్ గార్డ్ సహకారంతో ఇస్రో నిర్వహించింది. అనంతరం గగన్‌యాన్ మిషన్ కోసం పారాచూట్ ఆధారిత డిసిలరేషన్ సిస్టమ్ మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01) విజయవంతమైందని ఇస్రో ‘X’లో పోస్ట్ చేసింది. ఈ విజయం అన్ని సహకార సంస్థల ఉమ్మడి ప్రయత్నాల ఫలితం అని పేర్కొంది. ఇస్రో చీఫ్ వి.నారాయణన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గగన్‌యాన్ తొలి మానవరహిత ప్రయోగం (జి1 మిషన్) ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగుతుందని ప్రకటించారు. ఈ ప్రయోగంలో హాఫ్ – హ్యూమనాయిడ్ రోబోట్ ‘వ్యోమిత్ర’ అంతరిక్షంలోకి ప్రయాణిస్తుందని తెలిపారు. గగన్‌యాన్ మిషన్ పనిలో దాదాపు 80% పూర్తయిందని, ఇప్పటి వరకు దాదాపు 7,700 పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన 2,300 పరీక్షలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు