హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
బీహార్‌లో SIR కి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర ఆదివారం 8వ రోజు చేరుకుంది. ఈసందర్భంగా పూర్ణియాలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, ముఖేష్ సాహ్ని, CPI(ML) నాయకుడు దీపాంకర్ భట్టాచార్య, పప్పు యాదవ్ తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈసీకి బీజేపీతో పొత్తు ఉందని అన్నారు. ఇప్పటివరకు తన ప్రశ్నలకు ఈసీ ఎలాంటి సమాధానాలు చెప్పలేదన్నారు. కర్ణాటకలో కొత్తగా లక్ష మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని అడిగిన ప్రశ్నకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం రాలేదని విమర్శించారు. బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ నకిలీ ఓటర్లను చేర్చారని మాట్లాడితే ఆయన నుంచి ఎటువంటి అఫిడవిట్ అడగలేదని, కానీ తన నుంచి మాత్రం అఫిడవిట్ అడిగారని ఈసీపై ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల కమిషన్ ఎవరి వైపు ఉందో మీడియాకు కూడా తెలుసని చెప్పారు. తమ యాత్ర కారణంగా బీహార్‌లో ప్రతిఒక్కరూ రాజకీయంగా చురుకుగా మారారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు