హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్లైవుడ్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గోడౌన్‌లో ఉన్న లక్షల రూపాయల విలువైన సామాగ్రి మంటల్లో బూడిదైపోయింది.
స్థానిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో గోడౌన్‌లో ఉన్న కోళ్లు, మేకలు కూడా మంటల్లో కాలిపోయి చనిపోయాయి. అయితే ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ