అమరావతి, 24 ఆగస్టు (హి.స.)ఏపీకి మరోసారి బిగ్ అలెర్ట్. రాష్ట్రానికి అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో ఆగస్టు 25 నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 23 శనివారం ఏర్పడిన అల్పపీడనం అదే చోట కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి, పైకి వెళ్ళేకొద్దీ నైరుతి దిశగా వంగి కనిపిస్తోంది. రాబోయే 24 గంటల్లో ఇది జార్ఖండ్ వైపు పశ్చిమ–వాయువ్య దిశలో కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దీనితో పాటు రాష్ట్రం మొత్తం మీద నైరుతి–పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడవచ్చని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కూడా ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి