న్యూఢిల్లీ: ,24 ఆగస్టు (హి.స.) అమెరికా కస్టమ్స్ విభాగం జారీ చేసిన కొత్త నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో పార్శిళ్లను తీసుకెళ్లడానికి విమానయాన సంస్థలు నిరాకరిస్తున్న నేపథ్యంలో అమెరికాకు పోస్టల్ సేవలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ఈ నిలిపివేత సోమవారం నుంచి అమల్లోకి రానుంది. అయితే 100 డాలర్ల వరకూ విలువున్న బహుమతులు, లేఖలు, డాక్యుమెంట్ల సేవలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం శనివారం వెల్లడించింది. జులై 30వ తేదీన జారీ అయిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 29వ తేదీ నుంచి 100 డాలర్లకుపైగా విలువున్న పార్శిళ్లపై అమెరికా కస్టమ్స్ సుంకాలు వర్తించనున్నాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం అంతర్జాతీయ పోస్టల్ నెట్‌వర్క్, అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ (సీబీపీ) విభాగం ఆమోదించిన ‘క్వాలిఫైడ్ పార్టీ’ల ద్వారా వస్తువులను రవాణాచేసే సంస్థలే సుంకాలు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 15న జారీ చేసిన నిబంధనల ప్రకారం ‘క్వాలిఫైడ్ పార్టీ’ల నిర్ధారణకు పలు సంక్లిష్టమైన ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే సుంకాలను వసూలు చేసి.. జమ చేయడానికి ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్న దానిపై పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు విమానాలను నడిపే సంస్థలు భారత్ నుంచి సోమవారం తర్వాత తపాలా పార్శిళ్లను స్వీకరించడానికి నిస్సహాయత వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తపాలాశాఖ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపేయాలని నిర్ణయించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ