భూపాలపల్లి: , 24 ఆగస్టు (హి.స.)
పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే గతి తప్పారు. వారి మధ్య విభేదాల నేపథ్యంలో ఓ ఉపాధ్యాయుడు తాగునీటిలో పురుగుమందు కలపగా... ఆ నీరు తాగిన 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో ప్రభుత్వ పట్టణ గురుకుల విద్యాలయంలో చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు ఉపాధ్యాయులతోపాటు మరో వ్యక్తిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులున్నారు. శుక్రవారం వంట గది పక్కన ఉన్న ఆర్వో ప్లాంటు సమీపంలోని స్టీల్ క్యాన్‌లోని నీటిని తాగిన విద్యార్థుల్లో కొందరు కడుపునొప్పితో బాధపడగా.. మరికొందరు వాంతులు చేసుకున్నారు. దీంతో 11 మందిని ఆసుపత్రికి తరలించారు. బాధిత విద్యార్థులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈవో రాజేందర్, పురపాలక కమిషనర్ శ్రీనివాస్ శనివారం పరామర్శించారు.
ఘటన గురించి విద్యార్థులను ఆరా తీశారు. గతేడాది నుంచి గురుకుల విద్యాలయ ప్రత్యేకాధికారి వెంకన్నతో ముగ్గురు ఉపాధ్యాయులకు విభేదాలున్నాయని పలువురు విద్యార్థులు తెలిపారు. సైన్స్ ఉపాధ్యాయుడు రాజేందర్ తాగునీటి క్యాన్‌లో క్రిమిసంహారక మందు కలపడంతోపాటు, దుప్పట్లపై చల్లారని చెప్పారు. దీంతో ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ