పట్నా/న్యూఢిల్లీ: ,24 ఆగస్టు (హి.స.) బీహార్ ఓటర్లు లిస్టులో వింత వైనాలు వెలుగు చూస్తున్నాయి. 1950లలో భారత్‌లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తానీ మహిళలు బీహార్‌లో ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వెల్లడయ్యింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హోం మంత్రిత్వ శాఖ ఇటీవల వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయిన విదేశీయుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఉదంతం వెలుగు చూసింది.
భాగల్పూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు విదేశీ పౌరులుగా ఓటర్ల సవరణలో తేలారని అధికారులు నిర్ధారించారు. ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)మాట్లాడుతూ ఆ మహిళలకు సరిపోయే పాస్‌పోర్ట్ వివరాలతో కూడిన అధికారిక సమాచారం అందిందన్నారు. వారిలో ఒకరి పేరు ఇమ్రానా ఖానం. ఆమె వృద్ధురాలు. అనారోగ్యంతో ఉన్నందున మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పాస్‌పోర్ట్ 1956 నాటిది. ఇంకొక మహిళ కూడా ఇలానే భారత్‌లో ఉంటున్నారు. శాఖాపరమైన సూచనలను అనుసరించి వారి పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ