వేములవాడ, 24 ఆగస్టు (హి.స.)
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణకు ప్రధాన రహదారి నిర్మాణంతో శ్రీకారం చుట్టామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రూ. 6 కోట్ల 50 లక్షలతో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ తో పాటు, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణ వాసులు, రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల భక్తులు, ప్రజలు 54 ఏండ్లుగా ఎదురు చూస్తున్న వేములవాడ మూలవాగు నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నేడు అమలులోకి తీసుకు వచ్చామని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు