న్యూఢిల్లీ: ,24 ఆగస్టు (హి.స.)
భారత్ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థ(Integrated Air Defence Weapon System)ను పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. డీఆర్‌డీవో దీనిని అభివృద్ధి చేసింది.
‘‘సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ(IADWS)ను 23వ తేదీ అర్ధరాత్రి ఒడిశా తీరం నుంచి డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. IADWS అనేది బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. దీనిలో భారత్‌లో అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (QRSAM), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) మిసైల్స్, హైపవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ (DEW) ఉన్నాయి. IADWSను విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు డీఆర్డీవో(DRDO), సైనిక దళాలను నేను అభినందిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన పరీక్ష బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలియజేసింది. శత్రువులు ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి ఆయా ప్రాంతాల రక్షణను ఇది బలోపేతం చేయనుంది’’ అని ఎక్స్‌లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోస్టు చేశారు. ఆగస్టు 15న సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ ఎయిర్ డిఫెన్స్‌ను పరీక్షించడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ