అమరావతి, 24 ఆగస్టు (హి.స.)మరికొద్ది రోజుల్లో మొదలవనున్న వినాయక చవితి(Vinayaka Chaviti) ఉత్సవాలకు పల్లెలు, పట్టణాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఊరు వాడా గణేష్ మండపాల నిర్మాణాలు, ఏర్పాట్లు జోరందుకున్నాయి. అయితే వినాయక చవితి ఏరోజు నిర్వహించుకోవాలి అనే విషయంపై ప్రజల్లో గందరగోళం రేగింది. వినాయక చవితి ఆగస్టు 26 రోజునా లేక 27 రోజా అనే అయోమయానికి గురవుతున్నారు. అయితే ఈ నెల అమావాస్య ఆగస్టు 22, 23 రెండు రోజులు రావడంతో చవితి ఏరోజు అనేది సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు.
దీంతో పండగ ఏరోజు అనేది సందేహంగా ఉంది అందరిలో. కాగా ఈ సందిగ్ధంపై పండితులు క్లారిటీ ఇచ్చారు. భాద్రపద శుక్ల చవితి ఈనెల 27న అని, ఆరోజే వినాయక చవితి జరుపుకోవాలని చెబుతున్నారు. వినాయక పూజ చేసుకోవడానికి ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 1.40 వరకు మంచి ముహూర్తం అని అంటున్నారు. వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 6న నిర్వహించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి