విశాఖపట్నం25 ఆగస్టు (హి.స.)జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశాలను పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు విశాఖలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఇవి మూడ్రోజులు జరుగుతాయన్నారు. సమావేశాల ఏర్పాట్లను ఆదివారం ఆయన పోలీసులు, జీవీఎంసీ అధికారులతో పాటు పరిశీలించారు. జనసేన ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ‘సేనతో సేనాని’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. 28న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ ఉంటుందని.. మర్నాడు పార్లమెంటు నియోజకవర్గాలవారీగా ఆది నుంచీ పార్టీ కోసం కష్టపడి, వైసీపీపై పోరాటం చేసిన కార్యకర్తలు, ఆహ్వానితులతో సమావేశం ఉంటుందని... చివరి రోజు 30న పార్టీ రాష్ట్రస్థాయి క్రియాశీల కార్యకర్తల విస్తృతస్థాయి భేటీ జరుగుతుందని.. మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ సభ ప్రారంభమవుతుందని,
సాయంత్రం ఆరు గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారని వెల్లడించారు. ఈ సమావేశాల్లో మహిళల బాధ్యత, అందరికీ రక్షిత నీరు, ఉపాధి కల్పన తదితర అంశాలతోపాటు కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనపై చర్చించనున్నట్లు తెలిపారు. జనసేన నేతలు, కార్యకర్తలు.. కూటమిలో మిగిలిన 2 పార్టీల నేతలతో కలి సి ఏ విధంగా పనిచేయాలి... సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలో చర్చ జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం పై తమ అధినేత దిశానిర్దేశం చేస్తారని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ