హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)
ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే సిట్ ముందు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కావాల్సిందేనని, విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని కేసు దర్యాప్తునకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్ర వాదనలు వినిపిస్తూ.. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, ఎలక్ట్రానిక్ పరికరాలు, సాక్ష్యాధారాలు ట్యాంపరింగ్ చేశారని కోర్టుకు వివరించారు. డేటా రికవరీకి ప్రభాకర్ రావు సహకరించట్లేదని తెలిపారు. ప్రభుత్వ ల్యాప్ టాప్, ఫోన్లలో ఉన్న డేటా కూడా ఫార్మాట్ చేశారని అందులో ఎలాంటి డేటా లేకుండా చేశారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..