తిరుపతి: 25 ఆగస్టు (హి.స.)
తుడా టవర్స్‌ను జూన్ ఆఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ (Ponguru Narayana) తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్రమపద్ధతి లేకుండా టౌన్ ప్లానింగ్ చేశారని విమర్శించారు. ఓ పట్టణంలో ఇంటింటి సర్వే చేపట్టగా.. లేఔట్స్, భవనాలు ఇష్టమొచ్చినట్లు నిర్మించినట్లు అందులో తేలిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్‌కు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. తిరుపతిని మెగాసిటీగా మార్చేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు.
‘‘కూటమి ప్రభుత్వంలో నిర్మాణాల అనుమతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా టౌన్‌ప్లానింగ్ నిబంధనలను సరళతరం చేశాం. నిబంధనలు పాటిస్తూ నిర్మాణాలు చేసుకుంటే అందరికీ మంచిది. టీడీఆర్ బాండ్లు రాష్ట్రంలో ప్రధాన సమస్య. తణుకులో రూ.50 కోట్ల విలువైన బాండ్లను రూ.750 కోట్లకే జారీ చేశారు.. తిరుపతిలో 1077 బాండ్లు వచ్చాయి. వీటిలో 709 మంజూరు చేశారు.. ఇంకా 368 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో న్యాయపరమైన సమస్యలతో 59 ఉన్నాయి. రాష్ట్రంలో విశాఖ, గుంటూరు, తిరుపతిలో ఎక్కువ టీడీఆర్ బాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వీలైనంత తొందరగా క్లియర్ చేస్తాం’’ అని మంత్రి నారాయణ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ