న్యూఢిల్లీ: , 25 ఆగస్టు (హి.స.) ముఖ్యమంత్రి అయినా.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా? అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశ్నించారు. మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా? అంటూ విపక్షాలపై మండిపడ్డారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఏఎన్‌ఐ’కి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసందర్భంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాజీ ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ రాజీనామా అంశం పైనా స్పందించారు.
‘‘విపక్షాలు ఇప్పటికీ కూడా జైలుకు వెళ్తే సులభంగా ప్రభుత్వాలు ఏర్పాటుచేయగలమని అనుకుంటున్నారు. వారు జైలునే సీఎం, పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారు. అప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ వంటి ఉన్నతాధికారులు జైలు నుంచే ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సిద్ధాంతాలను నేను, మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదు’’ అని అమిత్ షా అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ