న్యూఢిల్లీ: , 25 ఆగస్టు (హి.స.) దేశ రాజధాని దిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరగడం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్(41)ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం ను కత్తితో పొడవాలని నిందితుడు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అయితే భారీ భద్రత కారణంగా తన ప్రణాళికను విరమించుకున్నట్లు సకారియా చెప్పినట్లు తెలుస్తోంది.
‘‘దిల్లీలో వీధి కుక్కలను తరలించాలని నేను చాలాసార్లు అభ్యర్థించా. దీని గురించి సీఎం పట్టించుకోకపోవడంతోనే ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నా. సీఎం అధికారిక నివాసానికి వెళ్లడానికి ముందు సుప్రీంకోర్టుకు వెళ్లా. న్యాయస్థానం బయట సెక్యూరిటీని చూసి అక్కడి నుంచి వచ్చేశా. అనంతరం సివిల్ లైన్స్‌లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లా. తొలుత ఆమెను కత్తితో పొడవాలని ప్లాన్ చేశా. కానీ, భద్రత ఎక్కువగా ఉండటం చూసి కత్తిని బయటే పడేశా’’ అని నిందితుడు సకారియా విచారణలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ