7.అమరావతి 26 ఆగస్టు (హి.స.)ఈటీవీ ఛానల్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఛానల్ యాజమాన్యం, సిబ్బందికి ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈటీవీ-మీటీవీ’ అంటూ తెలుగు ప్రజలకు ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచుతూ.. మూడు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు.
‘‘తెలుగు భాషకు, మన సంస్కృతీసంప్రదాయాలు, పండుగలు, కట్టుబాట్లకు పెద్దపీట వేస్తూ.. అన్ని వర్గాల ప్రజలను అలరించే కార్యక్రమాలను అందించడంలో ఈటీవీకి మరేదీ సాటి లేదు. పాడుతా తీయగా వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. 24 గంటల న్యూస్ ఛానల్స్ ఎన్ని వచ్చినా.. ఈటీవీ 9 PM న్యూస్ బులెటిన్ తెలుగునాట ఇప్పటికీ నెంబర్-1గానే నిలుస్తోంది. 9 గంటల బులెటిన్ చూస్తే చాలు... రోజంతా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అనే విధంగా ఒక బ్రాండ్‌ని సృష్టించుకుంది. రామోజీరావు ఆశయాలు, ఆలోచనలు, విలువలను కొనసాగిస్తూ.. నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది కృషితో ఈటీవీ ఉన్నత స్థాయికి ఎదిగింది. సరికొత్త ఉత్సాహంతో, టీమ్ వర్క్‌తో.. ఈటీవీ ప్రయాణం మరింత విజయవంతం అవ్వాలని, ప్రజలను అలరించాలని కోరుకుంటున్నా’’అని సీఎం పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు