మెదక్, 26 ఆగస్టు (హి.స.)
యూరియా కోసం రైతుల పక్షాన ధర్నా చేపడితే అరెస్టు చేస్తారా..? అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో యూరియా ఇవ్వడం లేదని రైతులు అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అక్కడకు చేరుకొని రైతులకు సంఘీభావంగా వారితోపాటు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం పోలీసులు అక్కడకు చేరుకొని ఎమ్మెల్యే ని, రైతులను అరెస్టు చేసి నర్సాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా యూరియా అడిగితే అరెస్టులు చేస్తారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రైతులకు యూరియాను సక్రమంగా అందజేశారని, రైతులు ఏనాడూ రోడ్లపైకి వచ్చిన పరిస్థితి లేదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు