విశాఖపట్నం: 26 ఆగస్టు (హి.స.)
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రలో పలు చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో దిశా నిర్దేశం చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ