న్యూఢిల్లీ,26 ఆగస్టు (హి.స.) దేశ మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, గిరిజనుల ఆరాధ్యుడు బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శత జయంతిని నిర్వహించడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన 3 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటుచేస్తూ సోమవారం గెజిట్ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఈ ఏడాది అక్టోబరు 31న పటేల్, నవంబరు 15న బిర్సా ముండాల 150వ జయంత్యుత్సవాలు జరగనున్నాయి. డిసెంబరు 25న వాజ్‌పేయీ శత జయంతి జరగనుంది. పటేల్‌పై వేసిన కమిటీలో 124 మంది, వాజ్‌పేయీపై కమిటీలో 128 మందిని నియమించారు. ఇందులో మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధాన మంత్రి, లోక్‌సభ స్పీకర్, 23 మంది కేంద్ర మంత్రులు, 20 మంది గవర్నర్లు, 21 మంది ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులున్నారు.
పటేల్‌పై కమిటీలో తెలుగు రాష్ట్రాల గవర్నర్లు జస్టిస్ అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ వర్మ, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీనియర్ పాత్రికేయుడు ఎ.సూర్యప్రకాశ్ ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ