కోల్‌కతా/ముంబయి,26 ఆగస్టు (హి.స.), ఈడీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేయడానికి వస్తున్నారని తెలిసి పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు తన ఇంటి మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటి చుట్టూ ఉన్న ఎత్తైన ప్రహరీని కూడా ఎక్కి, దూకేశారు. ఆయన్ను చూసి అధికారులు వెంబడించగా, ఆధారాలు దొరక్కుండా తన ఫోన్‌ను దూరంగా డ్రైనేజీలోకి విసిరిగొట్టారు. కానీ, అధికారులు ఆయన్ను పట్టుకొని అరెస్టు చేశారు. ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే
ఈ నేపథ్యంలోనే సోమవారం ముర్షీదాబాద్ జిల్లాలోని బుర్వాన్ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా, ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడానికి ఈడీ అధికారులు వెళ్లారు. వారిని చూసిన సాహా పారిపోవడానికి విఫల యత్నం చేశారు. ఇదే వ్యవహారంలో సాహాను 2023 ఏప్రిల్‌లో సీబీఐ అరెస్టు చేసింది. అప్పుడు కూడా ఆయన ఇదే విధంగా ప్రవర్తించారు. తన ఫోన్లను ఓ చెరువులోకి విసిరిగొట్టారు. వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు మూడు రోజులు పట్టింది. సీబీఐ కేసులో సాహా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ