హంసల్‌పూర్, 26 ఆగస్టు (హి.స.)భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. దేశీయ దిగ్గజం మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. గుజరాత్‌లోని హంసల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సుజుకి మోటార్ ప్లాంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు 'ఈ-విటారా' మొదటి యూనిట్‌కు ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచి ఓనో హాజరయ్యారు. ఈ ప్లాంట్ ప్రారంభం 'స్వయం సమృద్ధ భారత్' అన్వేషణలో ఒక ప్రత్యేకమైన రోజని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక్కడ తయారయ్యే బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన తొలి ఈ-విటారా యూనిట్‌ను యూకేకు పంపనున్నారు.
ఈ-విటారా ప్రత్యేకతలు ఇవే..
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని గతేడాది ఐరోపాలో తొలిసారిగా పరిచయం చేశారు. 2025 భారత్ మొబిలిటీ షోలో కూడా ప్రదర్శనకు ఉంచారు. టయోటాతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన 40పీఎల్ ప్రత్యేక ఈవీ ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును నిర్మించారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై టయోటా 'అర్బన్ క్రూయిజర్ ఈవీ' పేరుతో మరో మోడల్‌ను తీసుకురానుంది.
ఈ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో ఒకటి 49kWh కాగా, మరొకటి 61kWh సామర్థ్యం కలిగి ఉంటుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్ డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (ఆల్‌గ్రిప్-ఈ) కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా. మార్కెట్లో ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి వాహనాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ హైబ్రిడ్ వాహనాల కోసం లిథియం-అయాన్ బ్యాటరీ సెల్స్, ఎలక్ట్రోడ్‌లను తయారు చేసే ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్‌ను తోషిబా, డెన్సో, సుజుకి సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి