న్యూఢిల్లీ,26 ఆగస్టు (హి.స.)పాకిస్థాన్(pakistan)కు సున్నితమైన సమాచారం చేరవేస్తూ దొరికిపోయిన సీఆర్‌పీఎఫ్ (CRPF) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోతీరామ్ జాట్‌కు పెద్దసంఖ్యలో మన సైన్యం, పారామిలటరీ, ప్రభుత్వ అధికారులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి ఫోన్‌లో 15 మంది నంబర్లను దర్యాప్తు బృందం గుర్తించిందని ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. వీరిలో నలుగురు ఆర్మీ, నలుగురు పారామిలటరీ సిబ్బంది కాగా.. మిగిలినవారు ప్రభుత్వ అధికారులుగా తేలారు. జాట్‌ను మే 27న ఎన్‌ఐఏ (NIA) అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దర్యాప్తు బృందాలు ప్రస్తుతం జాట్ ఫోన్‌ను విశ్లేషిస్తున్నాయి. దీనినుంచి అతడు ఇంటర్నెట్ కాల్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అతడు పాకిస్థాన్‌లో సలీం అనే ఆపరేటివ్‌తో టచ్‌లో ఉన్నాడు. జాట్‌తో మాట్లాడేందుకు వాడే ఫోన్‌లోని సిమ్‌కార్డ్‌ను కోల్‌కతా నుంచి ఓ వ్యక్తి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దాని యాక్టివేషన్ ఓటీపీని కూడా అతడు లాహోర్‌లోని పాక్ ఆపరేటివ్‌తో పంచుకొన్నాడు. సదరు కోల్‌కతా వ్యక్తి పాక్ (pakistan) జాతీయురాలిని పెళ్లి చేసుకొన్నాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి స్థిరపడ్డాడు. ఏటా రెండుసార్లు కోల్‌కతా వెళ్లి వస్తుంటాడని గుర్తించారు. ఇక మోతీరామ్ జాట్ నుంచి అత్యంత సున్నితమైన సమాచార పత్రాలను సదరు లాహోర్ ఆపరేటివ్ తెప్పించుకొన్నాడు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ