ముంబయి,26 ఆగస్టు (హి.స.)దేశీయ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అమెరికా విధించిన అదనపు సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు లేకపోవడం మన సూచీలపై ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు నష్టాలకు కారణమవుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 600 పాయింట్లు నష్టపోయి 81,036 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 181 పాయింట్లు క్షీణించి 24,788 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.83గా ఉంది.
నిఫ్టీ సూచీలో బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, హీరో మోటార్‌కార్ప్ షేర్లు లాభాల్లో ఉండగా.. టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, సిప్లా స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. దీనిపై అమెరికా తాజాగా న్యూదిల్లీకి అధికారికంగా నోటీసులు పంపించింది. అగ్రరాజ్య కాలమానం ప్రకారం ఆగస్టు 27వ తేదీ ప్రారంభమయ్యే అర్ధరాత్రి 12.01 గంటల నుంచి (అంటే భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల ప్రాంతంలో) ఈ అదనపు సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ