న్యూఢిల్లీ,26 ఆగస్టు (హి.స.)సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీ పేర్లను సిఫార్సు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. సీజేఐతో కలిపి 34 న్యాయమూర్తి పోస్టులున్న సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు స్థానాల భర్తీ కోసం కొలీజియం వీరి పేర్లను ఎంపిక చేసింది. 1964 ఏప్రిల్ 13న జన్మించిన జస్టిస్ ఆలోక్ అరాధే ఇదివరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ పంచోలీ 1968 మే 28న జన్మించారు. ఆయన గత నెల 21నే పట్నా హైకోర్టు సీజే అయ్యారు. వీరిద్దరి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే సీనియారిటీ పరంగా జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ తర్వాత జస్టిస్ పంచోలీ 3.10.2031న సీజేఐగా బాధ్యతలు స్వీకరించి 27.5.2033 వరకు ఆ స్థానంలో కొనసాగే వీలుంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆరుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేశారు. ఆ స్థానాల్లో ఐదుగురు నియమితులయ్యారు. ఇప్పుడు కొత్తగా ఇద్దరి పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ