హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) చౌటుప్పల్ సమీపంలో జరిగిన రోడ్డు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీ ఏఎస్పీ ప్రసాద్ మృతిచెందారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద గత నెల 26న ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు స్కార్పియో వాహనంలో ఇద్దరు డీఎస్పీలు చక్రధరరావు, శాంతరావుతో పాటు ఏఎస్పీ ప్రసాద్ వస్తుండగా వారి వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బోల్తా పడిన వాహనం అవతలివైపు పడింది. అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వాహనం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఏఎస్పీ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కామినేని ఆస్పత్రికి తరలించి నెలరోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్