శ్రీశైలం, 27 ఆగస్టు (హి.స.)
ఆలయం: శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు దంపతులు ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు శ్రీమల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రవేశం చేసి శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ పూజా, కంకణ ధారణ వంటి పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అక్కడే నెలకొల్పిన పంచలోహ వినాయక మూర్తికి మంగళహారతులతో అర్చకులు పూజలు నిర్వహించారు. సాక్షి గణపతి ఆలయం వద్ద నేత్ర శోభితంగా ముస్తాబు చేసిన మండపంలో మట్టితో తయారుచేసిన వరసిద్ధి వినాయక స్వామిని కొలువుదీర్చారు. భక్తులు మృత్తిక గణపతిని సాక్షి గణపతి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వచ్చేనెల 5వ తేదీ వరకు శ్రీశైలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.శ్రీశైలంలో
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ