హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్ ప్రమాదంపు అంచున చేరింది. భారీగా వరదనీరు పైనుంచి వస్తుండటం వల్ల పది అడుగుల ఎత్తులో అలుగు దుంకుతోంది. అలుగు పక్కన ఉన్న మట్టికట్టను ఢీకొట్టి మరీ దాని మీద నుంచి పొంగిపొర్లుతోంది. వరద తాకిడి స్థాయికి మించి ఉండటంతో ఏ క్షణంలో అయినా మట్టి కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే దిగువన ఉన్న వందలాది ఎకరాలు నీటమునుగుతాయి.
పోచారం ప్రాజెక్టు ఏ క్షణంలో అయినా కొట్టుకుపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. రాబోయే 12 గంటలు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో దిగువ గ్రామాల ప్రజలను ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాగుల దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆయా గ్రామాల్లో చాటింపులు కూడా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు