దిల్లీ:27 ఆగస్టు (హి.స.): హైకోర్టు పరిధిలో మూడు నెలలకు మించి రిజర్వులో ఉంచిన తీర్పుల వివరాలను సంబంధిత ప్రధాన న్యాయమూర్తు(సీజే)ల దృష్టికి తేవాలని దేశంలోని హైకోర్టు రిజిస్ట్రార్ జనరళ్లను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఓ క్రిమినల్ అప్పీలుపై అలహాబాద్ హైకోర్టు 2021 డిసెంబరులో రిజర్వు చేసి ఉంచిన తీర్పును ఏడాదైనా ప్రకటించక పోవడంపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఈ కేసులో అప్పీలుపై విచారణ ముగిసి ఏడాది దాటినా తీర్పు వెలువరించకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. విచారణ పూర్తై నెలలు సంవత్సరాలూ గడిచినా తీర్పు వెలువరించని అనేక ఉదంతాలు మా దృష్టికి వస్తున్నాయి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘అత్యధిక శాతం హైకోర్టుల్లో తీర్పుల ప్రకటనలో తీవ్రజాప్యం ఎదురైనప్పుడు ఆ విషయాన్ని సంబంధిత ధర్మాసనం లేదా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి ఎలా తీసుకెళ్లాలో కక్షిదారులకు తెలీదు. అలాంటి సందర్భాల్లో కక్షిదారుడు న్యాయ ప్రక్రియపై నమ్మకం కోల్పోతాడు. ఇది న్యాయ అంతిమ లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది’ అని జస్టిస్ మిశ్ర అన్నారు. విచారణ పూర్తై మూడు నెలలు గడిచినా తీర్పు వెలువరించకపోతే రిజిస్ట్రార్ జనరల్ ఆ విషయాన్ని తమ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది
5
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ