జమ్మూ/దిల్లీ:27 ఆగస్టు (హి.స.): భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ అతలాకుతలమైంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. కత్రాలోని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు (Landslide in Jammu and Kashmir) విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. మరో 23 మంది గాయపడ్డారు. ఈమేరకు అధికారులు బుధవారం వెల్లడించారు. శిథిలాల కింద పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూబృందం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ముందుజాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను అధికారులు మూసివేశారు.
భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా పలుచోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ కశ్మీర్‌లోని జీలం నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ముప్పు నేపథ్యంలో 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ