తిరుమల, 27 ఆగస్టు (హి.స.)వినాయక చవితి పర్వదినం సందర్భంగా తిరుమల గిరులపై భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే తిరుమలలో ప్రస్తుతం రద్దీ సాధారణంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం తితిదే అధికారులు వెల్లడించారు. పండుగ నేపథ్యంలో చాలా మంది భక్తులు తమ ఇళ్ల వద్ద పూజల్లో నిమగ్నమవడంతో ఈ మార్పు కనిపించింది.
ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. అదేవిధంగా, సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3 నుంచి 5 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు గంట నుంచి మూడు గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.
ఇక నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 77,837 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,510 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీకి రూ. 3.49 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి