హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. నిత్యం ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకునే కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఇరువురు నేతలు సిరిసిల్లా జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకుపోయిన ఐదుగురు రైతులను హెలికాప్టర్ సాయంతో ఇవాళ రెస్క్యూ చేశారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించేందుకు బండి సంజయ్ అక్కడే ఉన్నారు. బాధితులు బయటకు వచ్చాక వారిని పరమార్శించి అక్కడి నుంచి కేంద్ర మంత్రి బయలుదేరుతున్నారు. అదే సమయంలో అప్పర్ మానేరు జలాశయం వద్దకు కేటీఆర్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఎదురుపడ్డారు. పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చిరునవ్వులతో అప్యాయంగా పలకరించుకున్నారు. కాసేపు ముచ్చటించుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం ఏర్పడింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..