హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభావితమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు హెలికాప్టర్ లో బేగంపేట విమానాశ్రయం నుంచి ఎరియల్ సర్వే కోసం బయలుదేరారు. శ్రీపాద ఎల్లంపల్లి, గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం, పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడిన సీఎం.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందని, చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. గోదావరి జలాల విషయంలో మనకు ఎల్లంపల్లి చాలా కీలకం అని చెప్పారు. ఈ సందర్భంగా వరద నియంత్రణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..