కర్నూలు, 28 ఆగస్టు (హి.స.)జామ పండు ఎంత రుచికరంగా ఉంటుందో.. దాని ఆకులు కూడా అంతే ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల కారణంగా జామ ఆకు రసం ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
అజీర్ణంతో బాధపడేవారికి జామ ఆకు రసం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారు జామ ఆకు జ్యూస్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే జ్వరం వచ్చినప్పుడు జామ ఆకు రసాన్ని ఒక చెంచా మరిగించి తాగితే జ్వరం త్వరగా తగ్గుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జామ ఆకు రసం తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి శరీరం బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమస్యలను నివారించి, శరీరాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు
చర్మం, జుట్టు సమస్యలతో బాధపడేవారికి కూడా జామ ఆకు రసం మంచి పరిష్కారం. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజమైన కాంతిని ఇవ్వడమే కాకుండా జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి.
గుండె ఆరోగ్యం
జామ ఆకు రసం తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. జామ ఆకులలో ఉండే పాలీఫెనాల్స్ రక్తంలో కార్బోహైడ్రేట్ల శోషణను నియంత్రించి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే జామ ఆకులను శుభ్రం చేసి, నీటిలో వేసి మరిగించి ఆ రసాన్ని తాగవచ్చు. అయితే, ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు వైద్య నిపుణులను సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి