హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలపై తెలంగాణ డీజీపీ జితేందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వరద ప్రభావిత కామారెడ్డి, నిర్మల్, మెదక్, రామాయంపేట వంటి ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసు బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని డీజీపీ జితేందర్ ప్రకటించారు. గత 24 గంటలుగా పోలీసు ఫోర్స్ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లను నిరంతరం నిర్వహిస్తోంది.
కామారెడ్డి జిల్లాలో చాలా మందిని సురక్షితంగా రక్షించగలిగామని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు సకాలంలో చేరుకోవడంతో భారీ ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు. కామారెడ్డి, మెదక్, నిర్మల్, రామాయంపేట ప్రాంతాల్లో వరదల కారణంగా చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు SDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), పోలీసు బృందాలు, ఫైర్ సర్వీసెస్, ఆర్మీ యూనిట్లు (TASA హైదరాబాద్) రంగంలోకి దిగాయి.*కామారెడ్డిలో 500 మందికి పైగా, మెదక్ లో 440 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రామాయంపేటలో SC మహిళల డిగ్రీ కాలేజీ హాస్టల్ నుంచి 350 మంది విద్యార్థినులను, SC & ST వెల్ఫేర్ హాస్టల్ నుంచి 80 మంది విద్యార్థులను రక్షించారు.
మెదక్ లోని హవేలీ ఘన్పూర్ మండలంలోని దూప్సింగ్ తండాలో 100 మందిని రక్షించారు.
కామారెడ్డి జిల్లాలోని అన్నసాగర్ గ్రామంలో 9 మందిని, గుంకుల్ గ్రామంలో 5 మందిని, మెదక్లోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ వద్ద 5 మందిని SDRF బృందాలు రక్షించాయి.
రామాయంపేటలోని BC కాలనీ నుంచి 10 మందిని, వాడీ బ్రిడ్జ్ వద్ద 11 మందిని రక్షించారని డిజిపి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్