ముంబయి,28 ఆగస్టు (హి.స.) దేశీయ మార్కెట్లు మరో రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). భారత్‌పై అమెరికా విధించిన 50శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మన సూచీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 977 పాయింట్లు క్షీణించి, 80,110 వద్ద ఉంది. నిఫ్టీ (Nifty) 200 పాయింట్లు నష్టపోయి 24,511 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.50 వద్ద కదలాడుతోంది.
నిఫ్టీ సూచీలో హీరో మోటార్‌కార్ప్, ఆసియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, మారుతీ సుజుకీ, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జియో ఫైనాన్షియల్, టీసీఎస్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా 50శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. దీనిపై వ్యాపారవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ పరిణామం దేశంలోని కీలక ఎగుమతి రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని, దేశవ్యాప్తంగా లక్షలాది కార్మికుల జీవనోపాధిని కూడా ప్రమాదంలో పడేస్తుందని ప్రధాని మోదీకి లేఖ రాశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ