ఢీల్లీ, 28 ఆగస్టు (హి.స.)మనదేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ నెంబర్ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఇక పిల్లల విషయానికి వస్తే, ఆధార్ డేటా సరైనంగా ఉండడం మరింత అవసరం. అయితే చాలా మంది తల్లిదండ్రులు దీనిని సరిగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దీని గురించి స్కూళ్లను అలర్ట్ చేస్తూ, ఈ ప్రక్రియను ముందే పూర్తిచేయాలని కోరుతోంది.
ఎప్పుడు అవసరం?
UIDAI చెప్పింది ఏమిటంటే, పిల్లలు 5 సంవత్సరాల వయసు చేరినప్పుడు ఒకసారి, ఆ తరువాత 15 సంవత్సరాల వయసులో మళ్లీ ఒకసారి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. ఈ అప్డేట్ వల్ల పిల్లల ఆధార్ డేటాలో ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ లాంటి బయోమెట్రిక్ వివరాలు కరెక్ట్‌గా నమోదు అవుతాయి.
స్కూళ్లను ముందుకు తీసుకురావడం
UIDAI ఇప్పుడు స్కూళ్లను ముందుకు తీసుకురావడం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలనుకుంటోంది. స్కూళ్లకు సంబంధించిన విద్యా డేటాను నిర్వహించే UDISE+ అనే అప్లికేషన్‌లో విద్యార్థుల బయోమెట్రిక్ స్టేటస్ కనిపించేలా మార్పులు చేశారట. అంటే, స్కూల్ యాజమాన్యానికి వెంటనే తెలిసిపోతుంది. ఎవరి అప్డేట్ పెండింగ్‌లో ఉందనేది.
ఎందుకు అవసరం ఈ అప్డేట్?
ఇది ఆలస్యం అయితే పిల్లలు భవిష్యత్తులో ఎన్నో ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా NEET, JEE, CUET లాంటి కీలక పరీక్షలకు నమోదు చేసుకునే సమయంలో ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆ సమయానికి బయోమెట్రిక్ లోపం ఉంటే, అప్పుడు ఇబ్బందులు తప్పవు. ఇదంతా ఉండకూడదని అనుకుంటే ముందుగానే అప్డేట్ చేసుకోవడం మంచిది.
17 కోట్ల మంది పిల్లల ఆధార్
ఇప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు 17 కోట్ల ఆధార్ నంబర్లు బయోమెట్రిక్ అప్డేట్ కోసం పెండింగ్‌లో ఉన్నాయట. ఇది చిన్న సంఖ్య కాదు. అందుకే UIDAI CEO భువనేష్ కుమార్ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాసి, స్కూళ్లలో ప్రత్యేక క్యాంపులుగా ఈ ప్రక్రియను నిర్వహించాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి