న్యూఢిల్లీ, 29 ఆగస్టు (హి.స.) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ శోధ కన్స్ట్రక్షన్స్ పై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం మన్నె క్రిశాంక్ మాట్లాడారు.
కేవలం రూ. 7 లక్షల ఆర్థిక లావాదేవీలు ఉన్న రేవంత్ రెడ్డి బావమరిది శోధ కన్స్ట్రక్షన్స్కు అమృత్ టెండర్లు, సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, డిండి ఇరిగేషన్ కాంట్రాక్టు ఇవ్వడంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు క్రిశాంక్ తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నపుడు ఏ కంపెనీ పేరుపై ఉన్న కారు వాడాడో ఇప్పుడు అదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.650 కోట్ల విలువ గల మూడు కాంట్రాక్టులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం.. దానిపై కూడా విచారణ జరగాలి. ఇటీవలే ఒక సంచలన కేసులో ఒత్తిడి పెడుతున్నారని తప్పుకున్న జడ్జి విషయంలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, సీఎం రేవంత్ సంబంధంపై విచారణ జరపాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు మన్నె క్రిశాంక్ తెలిపారు. వీటన్నింటికి సంబంధించి ఆధారాలతో సహా ఈడీకి సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..