అమరావతి, 29 ఆగస్టు (హి.స.):ప్రభుత్వ వైద్య కళాశాల్లో ప్రొఫెసర్ల కొరతను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 63 మందికి పదోన్నతి లభించింది. జాతీయ వైద్య సంఘం నియమాల మేరకు వివిధ కళాశాలల్లో ప్రొఫెసర్ల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం నిబంధనలు సడలించింది. నిబంధనల ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్‌గా మూడేళ్ల పనిచేసిన వారు మాత్రమే ప్రొఫెసర్ పదోన్నతికి అర్హులు. అయితే ప్రభుత్వం దీన్ని సడలిస్తూ.. ఒక ఏడాది అనుభవమున్న అసోసియేట్ ప్రొఫెసర్లను కూడా ప్రొఫెసర్లుగా నియమించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు 11 క్లినికల్ విభాగాలు, 2 నాన్ క్లినికల్ విభాగాల్లో 63 మందిని డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) పదోన్నతికి సిఫారుసు చేసింది. ఈ విధంగా పదోన్నతి పొందిన ప్రొఫెసర్లకు పోస్టింగులు ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకమార్ ఆమోదం తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో 35 మంది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 38 మంది పాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పని చేయడానికి అంగీకరించగా.. వారందరికీ పోస్టింగ్‌లు ఇచ్చారు. కాగా, ఆరోగ్యశాఖలో సుదీర్ఘకాలంగా పదోన్నతికి నోచుకోని డిప్యూటీ డైరెక్టర్ల (డీడీ)కు ఎట్టకేలకు ప్రమోషన్ లభించింది.
సర్వీసు నిబంధనల ప్రకారం రెండేళ్లు డీడీగా పనిచేసిన వారు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతికి అర్హుత లభిస్తుంది. అయినా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న ఐదుగురు డీడీలు 20 ఏళ్లుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. మరో ఇద్దరు 11 ఏళ్లుగా పదోన్నతి లేక ఇబ్బంది పడుతున్నారు. కాగా, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్యూటీ డైరెక్టర్లుగా ఉన్న రాజాభాను, పాండురంగప్రసాద్‌కు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించి, పోస్టింగ్స్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ