సిద్దిపేట, 29 ఆగస్టు (హి.స.)
మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. యూరియా వెంటనే పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో గజ్వేల్ పట్టణం నుంచి తూప్రాన్ వైపు వెళ్లే రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్కు అంతరాయం నెలకొంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. యూరియా అందించే వరకు ధర్నా విరమించేది లేదని అన్నదాతలు తేల్చి చెప్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్