విశాఖపట్టం, 29 ఆగస్టు (హి.స.)
విశాఖలో నేషనల్ హైవే 5 రోడ్డులో ఆర్టీసీ బస్సు దగ్ధమయింది. నగరంలోని శాంతిపురం వద్ద బస్సులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా అప్రమత్తమై బస్సు దిగిపోగా.. మంటలు బస్సంతా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. బస్సు దగ్ధమైన ప్రదేశానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు.
ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 2 వాహనాలతో మంటలను అదుపు చేశారు. కాగా.. కూర్మన్నపాలెం నుంచి విజయనగరరం వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం ఏమీ జరగలేదని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి