హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
. ఏకంగా పది రోజుల పాటు డిజిటల్ అరెస్టు చేశామని వయోధికుడిని మానసికంగా వేధించి రూ.72 లక్షలు కాజేశారు సైబర్ మోసగాళ్లు. బాధితుడు తేరుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బంజారాహిల్స్‌కు చెందిన 82ఏళ్ల వయోధికుడికి ఈ నెల 11న వాట్సప్ వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే పోలీసు దుస్తుల్లో ఓ వ్యక్తి తాను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసునని పరిచయం చేసుకున్నాడు. తమ వద్ద నమోదైన మనీలాండరింగ్ కేసులో ఖాతాను మీ ఆధార్ కార్డుతో తెరిచినట్లుగా గుర్తించామని, మిమ్మల్ని దోషిగా నమోదు చేశామని చెప్పాడు. దాని ప్రకారం మిమ్మల్ని డిజిటల్ అరెస్టుచేశామన్నాడు. ఇకపై ఎవరితోనూ మాట్లాడటానికి వీల్లేదని, విషయాన్ని బహిర్గతం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.
12న సుప్రీంకోర్టులో వాంగ్మూలం ఇవ్వాలంటూ వీసీ ద్వారా బాధితుడిని హడలెత్తించారు. కేసు దర్యాప్తు పూర్తయ్యేవరకు కోర్టులో డబ్బు డిపాజిట్ చేయాలని ఒత్తిడి తేవడంతో బాధితుడు రూ.72 లక్షలు ఆ మోసగాళ్లు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. ఇంకా డబ్బులు కట్టాలని ఒత్తిడి పెంచగా మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ