వాషింగ్టన్/న్యూఢిల్లీ,30 ,ఆగస్టు (హి.స.) రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌ను శిక్షించాలనే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ఆ దేశానికే ఎసరు తెస్తున్నాయి. భారత్ పట్ల అమెరికా వైఖరిపై ట్రంప్ ప్రభుత్వం సొంత ఆర్థిక వేత్తలనుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. భారత్‌పై అమెరికా సుంకాల చర్యలు ఏనుగును ఎలుక పిడికిలితో ఢీకొట్టినట్టుగా ఉందని అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ విమర్శించారు.
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వ్యక్తిలా అమెరికా వ్యవహరిస్తోందని, కానీ తనను తానే దహించుకుంటోందని విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు బ్రిక్స్ కూటమిని పోషిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. బ్రిక్స్‌ను విజయవంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా అమెరికా అభివృద్ధి చేస్తోందని గుర్తు చేశారు. కాగా, భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై రష్యా టుడేకు ఇచి్చన ఇంటర్వ్యూలో వోల్ఫ్ మాట్లాడారు.
బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తోంది..
‘భూమిపై అతిపెద్ద దేశం భారత్. సోవియట్ యూనియన్ కాలం నుంచే అమెరికాతో భారత్‌కు బలమైన సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ మర్చిపోతున్నారు. భారత్‌కు అమెరికా మార్కెట్ గేట్లు మూసేస్తే.. ఆ దేశం తన ఎగుమతులను విక్రయించడానికి ఇతర దేశాలను వెదుక్కుంటుంది. చమురును అమ్ముకునేందుకు రష్యా ఇతరత్రా మార్కెట్లను సిద్ధం చేసుకున్నట్లే.. భారత్ కూడా ఇతరత్రా మార్కెట్లను తయారు చేసుకోగలదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ