న్యూఢిల్లీ,30 ,ఆగస్టు (హి.స.) ఒక మహిళ వరకట్న వేధింపులకు గురవుతుంటే ఆ వార్త గాలికంటే త్వరితంగా వ్యాప్తి చెందుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. తన కోడలిపట్ల క్రూరంగా ప్రవర్తించిందంటూ ఆరోపణ ఎదుర్కొన్న ఒక మహిళ(అత్త)ను నిర్దోషిగా ప్రకటిస్తూ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడుకున్న ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ మహిళకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితురాలు తనను వరకట్న వేధింపులకు గురిచేసిందని ఆమె కోడలు తన కుటుంబ సభ్యులతో చెప్పిందన్న వాదన ప్రాతిపదికన కింది కోర్టు, హైకోర్టు మహిళకు ఐపీసీలోని సెక్షన్ 498 ఏ కింద కారాగార శిక్ష ఖరారు చేశాయి. అయితే నిందితురాలు బాధితురాలిని కట్నం కోసం ఏనాడూ వేధించలేదని ఆమె పొరుగింటావిడ పేర్కొందని సుప్రీంకోర్టు తెలిపింది.
కింది కోర్టు, హైకోర్టు ఈ సాక్ష్యాన్ని బేఖాతరు చేశాయని సుప్రీంకోర్టు పేర్కొంది. వరకట్న డిమాండును గురించిన సమాచారం కేవలం నాలుగు గోడలకే పరిమితం అవుతుందన్న హైకోర్టు వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బాధితురాలు మెట్టినింట్లో మరణించాక ఆమె తండ్రి 2001 జూన్‌లో అందుకు సంబంధించి ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ కేసులో మృతురాలి అత్తమామల్ని, బావను తొలుత నిందితులుగా పేర్కొన్నారు. మహిళ ఆత్మహత్య చేసుకొని మరణించినట్టు తేల్చిన కింది కోర్టు నిందితులుగా పేర్కొన్న పురుషుల్ని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే క్రూరంగా వ్యవహరించిందంటూ మృతురాలి అత్తకు శిక్ష విధించింది. ఈ కేసులో మృతురాలి తల్లి కోర్టుకు సమర్పించిన వాదన నమ్మశక్యంగా లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ