న్యూఢిల్లీ,30 ,ఆగస్టు (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ కల్కాజీ ఆలయంలో ఘోరం జరిగింది. ఆలయంలో ప్రసాద వితరణ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, ఆలయ సేవకుని హత్యకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు తెలిపిన ప్రకారం శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కల్కాజీ ఆలయంలో చోటుచేసుకున్నఘర్షణ గురించి పోలీసులకు ఫోన్ వచ్చింది. కొందరు భక్తులు ప్రసాదం కోసం డిమాండ్ చేసిన సందర్భంగా వివాదం చెలరేగింది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ నేపధ్యంలో కొందరు ఆగ్రహంతో ఊగిపోతూ, కర్రలతో ఆలయ సేవకునిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఆలయ సేవకుడు అపస్మారక స్థితిలో పడి ఉండటం, ఇద్దరు వ్యక్తులు అతనిని కర్రలతో కొట్టడం కనిపిస్తోంది.
ఆలయ సేవకుడిని ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌కు చెందిన యోగేంద్ర సింగ్ (35) గా పోలీసులు గుర్తించారు. అతను గత 15 ఏళ్లుగా ఆలయంలో సేవ చేస్తున్నాడు. దాడి అనంతరం బాధితుడిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ