గుంటూరు 31 ఆగస్టు (హి.స.)ఆ గ్రామంలో అప్పటి వరకు ఆరోగ్యంగా, చలాకీగా ఉన్న వారు అంతుచిక్కని వ్యాధితో ఉన్నట్టుండి పడిపోతున్నారు. జ్వరం, కీళ్ల నొప్పులతో మొదలవుతున్న వ్యాధి చివరకు ప్రాణాలు తీసేస్తోంది. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. ఈ చిన్న గ్రామంలో ఇటీవల 30 మంది అర్ధంతరంగా మరణించారు. వ్యాధితో బాధపడుతున్నవారిని ఆసుపత్రికి తరలించినా ఉపయోగం ఉండటం లేదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొత్త వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయా? అని గ్రామస్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వరుస మరణాలతో వారు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ మరణాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఎపిడిమిక్ సెల్ ద్వారా శుక్ర, శనివారాల్లో గ్రామంలో సర్వే నిర్వహించారు.
అది ఇంకా కొనసాగనుంది. ఎపిడిమిక్ బృందంతో పాటు గుంటూరు వైద్య కళాశాలకు చెందిన ఎస్‌పీఎం, మైక్రోబయాలజీ వైద్యనిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యుల బృందం తురకపాలెంలో పర్యటించారు. మృతి చెందిన 25 మంది వ్యక్తులను గుర్తించి వారి కుటుంబ సభ్యులతో మరణ కారణాలపై పలు ప్రశ్నలు అడిగి (వెర్బల్ అటాప్సీ) వివరాలు తెలుసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా వ్యాధి అనుమానిత కుటుంబ సభ్యుల నుంచి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. గ్రామంలో మంచినీటి నమూనాలను కూడా కోసం సేకరించి పరీక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ