తియాంజిన్,న్యూఢిల్లీ,31 ,ఆగస్టు (హి.స.): ప్రధాని మోదీ ఏడేళ్ల విరామం తర్వాత చైనా గడ్డపై కాలు పెట్టారు. జపాన్ పర్యటనను ముగించుకొని ఆయన శనివారం సాయంత్రం తియాన్‌జిన్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సులో పాల్గొంటారు. అమెరికాతో తీవ్రమైన వాణిజ్యపరమైన ఉద్రిక్తతల వేళ మోదీ చైనాలో పర్యటించడం, జిన్‌పింగ్‌తో సమావేశం కానుండటంతో పాటు వాణిజ్య ఉద్రిక్తతలకు కారణమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇదే సమయంలో చైనాలో పర్యటిస్తుండటం, మోదీతో ప్రత్యేకంగా సమావేశం అవుతారన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా ఈ ముగ్గురు నేతలపైనే ఉంది. జపాన్ పర్యటన సమయంలో ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో.. ‘‘ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కోసం చైనా, ఇండియా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని నొక్కి చెప్పారు. మరోవైపు, పుతిన్ చైనాను ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కీలకమైన దేశం’గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు దేశాధినేతలు తమ భేటీల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ