న్యూఢిల్లీ,31 ,ఆగస్టు (హి.స.) భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం సుంకం విధింపు ప్రభావాన్ని తట్టుకోవడంలో ఎగుమతిదార్లకు సహకారం అందించే నిమిత్తం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. పలు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) విధానాలకు సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తోందని ఓ అధికారి తెలిపారు.
స్వల్పకాలిక చర్యలు: నిధుల లభ్యతను పెంచడం, దివాలా పరిస్థితులను నివారించడం, సెజ్‌లోని యూనిట్లకు మరింత అనుకూల వ్యాపార పరిస్థితులు సృష్టించడం
మధ్యకాలిక చర్యలు: మరిన్ని దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు ప్రాధాన్యం. జీఎస్‌టీ సంస్కరణల ద్వారా అంతర్జాతీయ విపణుల్లో దేశీయ సంస్థల పోటీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం
దీర్ఘకాలిక చర్యలు: ఎగుమతి విపణులు, ఉత్పత్తుల్లో వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా సెజ్ సంస్కరణలు, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం.
భారత సంస్థలకు ఎలాంటి ఇబ్బంది లేదు: గోయల్
బలమైన దేశీయ విపణి అండ ఉన్నందున అమెరికా అధిక సుంకాల వల్ల భారత వ్యాపార సంస్థలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అంతేకాకుండా ఈ ఏడాది భారత ఎగుమతులు పెరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెరికాకు ఎగుమతి చేస్తున్న 87 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల్లో 46 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అదనపు సుంకాల ప్రభావం ఉండదని గుర్తుచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ